సమస్యల పరిష్కారంలో ముందుంటా
జన్నారం: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం జన్నారం మండలం పొనకల్ ఈర్లగుట్టపై జరిగిన శ్రీ కేతేశ్వర కంకాలమ్మ జాతరకు హాజరై శివాలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ కమిటీ కోరిక మేరకు రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానన్నారు. ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు ఉన్న దారి అటవీశాఖ పరిధిలో ఉందని, వారితో చర్చించి సాధ్యమైతే రోడ్డు సౌకర్యానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింగరావు, వైస్ చైర్మన్ చిలువేరు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, సీనియర్ నాయకులు గుర్రం మోహన్‌రెడ్డి, శంకర్, నందునాయక్, సతీశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


