గొర్రెల్లో మశూచి వ్యాధి నివారణ చర్యలు
చెన్నూర్‌రూరల్: గొర్రెల్లో మశూచి వైరస్ వ్యాప్తి చెందే అంటువ్యాధి. వాటి చర్మంపై వెంట్రుకలు లేని భాగాలు పొదుగు, పొట్ట, ఛాతీ, పెదవులు, తోక కింద పొక్కులు ఏర్పడి చితికి పుండ్లు అవుతాయి. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, (డొబ్బ) కండకాలు, మూత్రపిండాల్లో పొక్కులు ఏర్పడి, ఆమారం, శ్వాస సరిగా తీసుకోలేక జీవాలు చనిపోతుంటాయి. మశూచి సోకకుండా జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు చేపట్టాలని కత్తెరసాల పశు వైద్యాధికారి సతీశ్ వివరించారు.
వ్యాధి వ్యాప్తి చెందే విధానం:
మశూచి వ్యాధిసోకిన గొర్రె, వేరొక గొర్రెను తాకడం ద్వారా సోకుతుంది. కలుషితమైన దాణా, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. వ్యాధిగ్రస్థ గొర్రె అన్నిస్రావాల్లో వైరస్ కణాలు ఉంటాయి. గొర్రె శరీరంలోకి ప్రవేశించి 2 నుంచి 14 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి.
మాలిగ్నెంట్ రకం:
ఇది మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. గొర్రె పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. అధిక జ్వరంతో చర్మం బాగా ఎర్రబడి ఉంటుంది. జీవాలు మందకొడిగా ఉంటాయి. ఆహారం తీసుకోవు. కంటి నుంచి ముక్కు నుంచి నీళ్లు కారుతుంటాయి. మశూచి పొక్కులు చర్మం మీద పూర్తిగా ఏర్పడకముందే కొన్నిసార్లు జీవాలు చనిపోతుంటాయి. మశూచి పొక్కులు నోటి భాగం ఏర్పడినప్పుడు న్యూమోనియా వ్యాధి సోకి ఊపిరి తీసుకోవడం కష్టమై విపరీతంగా దగ్గుతుంటాయి.
బైనెన్ రకం: ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పెద్ద గొర్రెల్లో వస్తుంది. మశూచి పొక్కులు చర్మంపై వెంట్రుకలు లేని భాగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆడ గొర్రెల్లో పొదుగుపైన పొక్కులు వచ్చినప్పుడు చితికి పుండ్లుగా మారి బ్యాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధి వస్తుంది. దీంతో పిల్లలకు పాలు సరిగా రాక పిల్లలు చనిపోతుంటాయి.
నివారణ చర్యలు:
జీవాలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. కొత్త జీవాలను మందలో చేర్చుకునే ముందు, కొన్నిరోజుల పాటు దూరంగా ఉంచాలి. గొర్రె పిల్లలకు తగినంత జున్ను పాలను తాగించడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
వ్యాధి సోకిన తర్వాత:
వ్యాధి సోకిన జీవాలను వెంటనే మందలోంచి వేరు చేసి ప్రత్యేకంగా ఉంచి పశు వైద్యుడిని సంప్రందించాలి. వ్యాధిబారినపడ్డ గొర్రెలను బయటకు వెళ్లనివ్వకూడదు. వ్యాధి సోకి చనిపోయిన జీవాల కళేబరాలను లోతుగా గొయ్యి తీసి సున్నం వేసి అందులో పూడ్చిపెట్టాలి. జీవాలు చనిపోయిన ప్రదేశాన్ని, మేత, నీటి తొట్టెలను క్రిమి సంహారక ద్రావణంతో శుభ్రపర్చాలి. అవి తినగా మిగిలిన పదార్థాలను కాల్చి వేయాలి.
గొర్రెల్లో మశూచి వ్యాధి నివారణ చర్యలు


