నకిలీపత్రాలతో రెండో పాస్‌పోర్ట్.. కటకటాల్లోకి విలేకరి
ఇజ్రాయెల్ వెళ్లేందుకు అడ్డదారి తొక్కిన వేణుగౌడ్ తల్లిదండ్రుల పేర్లు మార్చి 2016లో రెండో పాస్‌పోర్ట్ అధికారుల పరిశీలనలో వెలుగులోకి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
నేరడిగొండ: విదేశాలకు వెళ్లేందుకు నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలు సృష్టించి, రెండు పాస్‌పోర్టులు పొందిన ఓ పత్రిక విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నేరడిగొండ మండలంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన వేణుగౌడ్ కొంతకాలంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లాలనే ఉద్దేశంతో 2012లో మొదటిసారి పాస్‌పోర్టు తీసుకున్నాడు. అప్పట్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోగా, సాంకేతిక కారణాలతో పాస్‌పోర్టు చెల్లదని తిరస్కరణకు గురైంది. ఎలాగైనా విదేశాలకు వెళ్లాలనే అత్యాశతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 2016లో అడ్డదారి తొక్కాడు. తల్లిదండ్రుల పేర్లు మారుస్తూ నకిలీపత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించి రెండో పాస్‌పోర్టు పొందాడు. రెండు వేర్వేరు పాస్‌పోర్టులు ఉండటంతో సంబంధిత కంపెనీ అధికారులు వీసా ప్రక్రియను నిలిపివేశారు. ఈక్రమంలో గతేడాది వేణుగౌడ్ మరోసారి పాస్‌పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల పరిశీలనలో ఒకే వ్యక్తికి వేర్వేరు వివరాలతో రెండు పాస్‌పోర్టులు ఉన్న విషయం బయటపడింది. నకిలీ పత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్ పొందినందుకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుగౌడ్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


