ముగిసిన ‘నిపా’ శిక్షణ
మంచిర్యాలఅర్బన్: స్థానిక ప్రైవేట్ హోటల్‌లో కేజీబీవీ ప్రత్యేక అధికారులకు జాతీయ విద్యాప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్‌ఐఈపీఏ) నిపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ ఆదివారం ముగిసింది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన కేజీబీవీ ఎస్‌వోలు, మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ల ఐదురోజుల శిక్షణ ఉత్తేజాన్ని నింపింది. సామర్థ్యాల పెంపు, ఉత్తమ ఫలితాలు సాధించడం..నాణ్యమైన విద్యపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తార్ఫీదు ఇచ్చారు. విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, వసతిగృహాల నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ పొందారు. భావోద్వేగపరంగా సురక్షత హాస్టల్, వసతిగృహ వాతావరణాన్ని ఎలా సృష్టించడంపై డ్యాకుమెంటేషన్ చిత్రాలతో ప్రదర్శించారు. సమస్యల మూలాలు, మానసిక ఆరోగ్యం..నిశబ్ధ వర్గీకరణ తదితర అంశాలెన్నో చర్చకు వచ్చాయి. కేజీబీవీల బలోపేతంపై బృంద చర్చలు, నాటిక ప్రదర్శన తీరు ఆలోచింపజేశాయి. శిక్షణ పొందిన ఎస్‌వోలు, వార్డెన్లు ప్రాస్పెక్టివ్ సర్టిఫికెట్లు అందుకున్నారు. సెక్టోరల్ అధికారులు విజయలక్ష్మి, చౌదరి, సత్యనారాయణమూర్తి, నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ నవీనజ్యోతి, అసిస్టెంట్ జెండర్ కోఆర్డినేటర్ రమాదేవి, ట్రైనర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


