భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఈనెల 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను పరిశీలించి మెస్రం వంశీయులు, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 22న జరిగే నాగోబా దర్బార్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు రానున్నట్లు తెలిపారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయంలో శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.22 కోట్ల నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సర్పంచ్ మెస్రం తుకారం, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఈఈ తానాజీ, పంచాయతీరాజ్ డీఈ పవార్ రమేశ్ తదితరులు ఉన్నారు.


