‘పది’ంతల పక్కా ప్రణాళిక..!
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదోతరగతి కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో సాధించే మార్కులు, సబ్జెక్టు నైపుణ్యాలు భవిష్యత్‌కు పునాదులుగా నిలుస్తాయి. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈనెల 19 నుంచి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. రోజుకు ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్టడీ అవర్ నిర్వహించి పాఠ్యాంశాల్లో సందేహాలు నివృత్తి చేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య శుక్రవారం ప్రత్యేక తరగతులు, ప్రాక్టీస్ పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
పక్కా ప్రణాళికతో..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9,866 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎయిడెడ్ పాఠశాలల్లో 75 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 254, కేజీబీవీల్లో 733, లోకల్ బాడీలో 3,040, మోడల్ స్కూల్‌లో 440 మంది ఉన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఉదయం 8:15 నుంచి 9:15 గంటల వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఫలితాలు మెరుగుపడేలా..
జిల్లాలో గతేడాది ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 9,179 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా 8,961 మంది ఉత్తీర్ణత సాదించారు. రాష్ట్రంలో జిల్లా 17వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 5,983 మంది విద్యార్థులకు గానూ 5,726 మంది విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ, లోకల్‌బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్‌లో 4,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా స్పెషల్ క్లాస్‌లతో శతశాతం ఫలితాలు సాధించేలా సన్నద్ధమవుతున్నారు.
తరగతులు ఇలా..
ప్రత్యేక తరగతులు ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయి ప్రణాళిక, తరగతి నిర్మాణం బహుళ విభాగాలు, బోధనా మాధ్యమాలు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రతీ దానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కీలక సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెగ్యులర్ పీరియడ్‌లో పాఠం, అంశం వివరణ, అంశానికి సంబంధించిన విద్యా ప్రమాణాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థాయి ఆధారిత అభ్యాసం, గ్రాఫ్‌లు, రేఖాగణిత నిర్మాణాలతో పాటు వ్యక్తిగతీకరించిన విద్యా మార్గదర్శకత్వం, మద్దతు అందించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల పురోగతి ట్రాక్ చేయటానికి సబ్జెక్టు ఉపాధ్యాయుడు వివరణాత్మక రికార్డులను నిర్వహించాలి. ప్రతీ విద్యార్థి పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.


