ఇరుగు పొరుగు సాయంతో..
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ఇళ్లల్లో పిండివంటలు ఘుమ ఘుమలాడుతున్నాయి. సకినాలు, అరిసెలు, గారెలు, కారప్పూస, బూరెలు, కర్జాలు ఇలా రకరకాల పిండివంటలు నోరూరిస్తున్నాయి. పిండివంటలు చేయడంలో ఇంటిల్లిపాది మహిళలు నిమగ్నమయ్యారు. సంక్రాంతికి పేద, ధనిక అనే తేడా లేకుండా వారం రోజుల ముందు నుంచే పిండివంటలు చేయడం మొదలు పెడతారు. పిండి తయారు చేయడం, రకరకాల పిండివంటలు చేయడం, నూనెలో వేయించడం ఇవన్నీ చేయాలంటే ఒక్కరు ఇద్దరుతో సాధ్యమయ్యే పని కాదు.. అందుకే మహిళలు ఇరుగు పొరుగు మహిళలు, బంధువుల సాయం తీసుకుంటారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, దండేపల్లి తదితర మండలాల్లో మహిళలు పిండివంటలు చేయడంలో ఒకరికొకరు సాయపడుతున్నారు. ఒకరోజు ఒకరి ఇంట్లో అందరూ కలిసి పిండివంటలు చేస్తే.. మరో రోజు మరొకరి ఇంట్లో చేస్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇళ్లకు చేరిన యువతులు పిండివంటలు చేయడంలో కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నారు. మరికొందరు విదేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు పంపించడానికి పిండివంటలు చేస్తున్నారు. మొత్తంగా రకరకాల పిండివంటలతో ఇళ్లల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది.
ఏటా సంక్రాంతికి వస్తాం
దండేపల్లి: మేము ఉపాధి నిమిత్తం ముంబయిలో ఉంటున్నాం. అక్కడ పిండివంటలు చేసుకునే వీలుండదు. అందుకని ఏటా సంక్రాంతికి సొంతూరు దండేపల్లికి వస్తాం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి సాయంతో పిండి వంటలు చేసుకుంటాం. నేను కూడా వారి ఇళ్లకు వెళ్లి పిండివంటల తయారీలో సాయపడతా.
– ముడారపు లక్ష్మి, దండేపల్లి
సంక్రాంతికి పిండివంటలు ఎక్కువ మొత్తంలో చేసుకుంటాం. సకినాలు, అరిసెలు తయారు చేసే టప్పుడు ఇరుగు పొరుగు సాయం తప్పనిసరి. మూడు, నాలుగు తీర్ల అప్పాలు ఒక్కరం (పిండి వంటలు) చేయడం కష్టం. అందుకే అలసట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ పిండివంటలు చేసుకుంటాం.
– నాంపల్లి మాధవి, మంచిర్యాల
ఇరుగు పొరుగు సాయంతో..
ఇరుగు పొరుగు సాయంతో..


