నూతన ప్రాజెక్టులతోనే ఏరియాకు భవిష్యత్
తాండూర్/శ్రీరాంపూర్/మందమర్రిరూరల్: నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తేనే బెల్లంపల్లి ఏరియాకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సింగరేణి(ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి మహావీర్ ఖని(ఎంవీకే) ఓపెన్‌కాస్ట్ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. గతంలో ఉత్పత్తి సాధించి మూసివేసిన ఎంవీకే–1, 2, 3, 5, 6, ఇంక్‌లైన్ గనులు, మాదారంటౌన్‌షిప్‌లను సందర్శించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాలో జీఎంలతో మాట్లాడారు. మందమర్రి ఏరియాలోని రైల్వే సైడింగ్ పనులను ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కై రిగూడ ఓపెన్‌కాస్ట్ త్వరలో మూసివేతకు గురయ్యే పరిస్థితుల దృష్ట్యా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు ఆవశ్యకమన్నారు. అన్ని ఏరియాల్లో మొక్కలు నాటడానికి నర్సరీలను సిద్ధం చేయాలని సూచించారు. మాదారంటౌన్‌షిప్‌లో డైరెక్టర్‌ను డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ కుశ్నపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు బయ్య మొగిళి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ప్రాజెక్టు మేనేజర్ మహేష్, సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్, శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఎస్వో టు జీఎం లలితేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


