వ్యాధులు ప్రబలకుండా చర్యలు
మంచిర్యాలటౌన్: జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, కీటకజనిత వ్యాధులను గుర్తించడం, పరీక్షలు చేసి మందులు అందించడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని వైద్యులు, సిబ్బందితో శుక్రవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య ఉపకేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటివి ప్రబలకుండా సర్పంచులు, మున్సిపల్ అధికారుల సహకారం తీసుకోవాలని అన్నారు. జిల్లాలో క్షయ నియంత్రణలో భాగంగా మొబైల్ ఎక్స్‌చేంజ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని వ్యాధిగ్రస్తులను గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్ ఆర్‌ఎస్ పద్మ, ఎస్‌వో కాంతారావు, డీడీఎం ప్రవళిక, డెమో బుక్క వెంకటేశ్వర్, వసుమతి పాల్గొన్నారు.


