బాలికల ఆరోగ్యం, విద్యతోనే అభివృద్ధి
కోటపల్లి: బాలికల ఆరోగ్యం, విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా గర్‌ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లావణ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. బాలికలు ఆరోగ్యవంతంగా ఉంటూ నాణ్యమైన విద్య అభ్యసించినప్పుడే జీవితంలో స్థిరత్వం, అత్మవిశ్వాసం పెరిగి కుటుంబం, సమాజ అభివృద్ధికి దోహదపడుతారని తెలిపారు. విద్యార్థులు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకుని పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే వచ్చేలా చూడాలని కోరారు. నిరంతర విద్యాభ్యాసంతోనే ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. అనంతరం భోజనం, ఆరోగ్య పరీక్షలు, వసతుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మధునయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


