చికిత్స పొందుతూ యువకుడు మృతి
కాసిపేట: మండలంలోని కోమటిచేను గ్రామ పంచాయతీ పరిధిలోని సామగూడలో ఈనెల 5న గుర్తు తెలియని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన పేంద్రం శంకర్ (32) శుక్రవారం మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఒక యువతిని ప్రేమించిన యువకుడు ఆమె నిరాకరించడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడుతూ ఉండేవాడు. ఈక్రమంలోనే పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి జంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ఆదిలాబాద్‌లో దారి దోపిడీ
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలో దారి దోపిడీ జరిగి ఘటన వెలుగు చూసింది. టూటౌన్ సీఐ కే.నాగరాజు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఖుర్షీద్‌నగర్ కాలనీలో గల శ్రీరాం జిన్నింగ్‌లో పనిచేసే మునేశ్వర్ గౌరవ్ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వడ్డెర కాలనీ నుంచి కాలినడకన మిల్లు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు భయపెట్టి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు రూ.1,050 నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఏడుగురిపై కేసు
ఇచ్చోడ: మండలంలోని విజయ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి కొనుగోలులో గోల్‌మాల్ చేసిన ఏడుగురిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో బండారి రాజు తెలిపారు. విజయ జిన్నింగ్ మిల్లులో డిసెంబర్ 15, 16 తేదీల్లో ఒకే ట్రాక్టర్ పత్తిని రెండు సార్లు తూకం వేసినట్లు తెలిసిందన్నారు. దీంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంఘటనకు పాల్పడిన మూలే మారుతి, చెర్ల అరుణ్‌కుమార్, ఐద శివరాజ్, గోతి సునీల్, నవీన్, నీలేష్, వారికి సహకరించిన గోకుల నారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దాదాపుగా 82 క్వింటాళ్ల పత్తిని పథకం ప్రకారం సీసీఐని మోసగించి రూ.6,61,662 ఏడుగురు వ్యక్తులు పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళ అదృశ్యం
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మహేంద్రబస్తీకి చెందిన కొల్లూరి మల్లక్క (60) అదృశ్యమైనట్లు దేవా పూర్ ఎస్సై గంగారాం తెలి పారు. ఈనెల 5న మల్లక్క గోలేటిలో ఉన్న కూతురు వద్దకు వెళ్లివస్తానని చెప్పి బయలుదేరింది. కూతురు వద్దకు వెళ్లలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకి లభించలేదు. మల్లక్క భర్త భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి


