నాగోబా జాతర ఏర్పాట్లు పూర్తిచేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం కేస్లాపూర్‌ను సందర్శించి ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపుగదుల ఏర్పాటు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గతేడాది దర్బార్‌కు వచ్చిన దరఖాస్తులతో పాటు ఉప ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలు విన్నవించిన సమస్యలు, లబ్ధిదారుల వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం తుకారాం, ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దు
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు సరఫరా చేసే ఆహారపదార్థాలు, సరుకుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడవద్దని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మట్ అన్నారు. ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ వసతి గృహాలకు ఆహార పదార్ధాలు సరఫరా చేసేందుకు గుత్తేదారులను ఖరారు చేయటానికి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమావేశంలో నిర్ణయించిన ధరలకే గుత్తేదారులు సరుకులను సప్లయ్ చేయాలన్నారు. నాణ్యత విషయంలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీడీ జాదవ్ అంబాజీ, జీసీసీ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, గులాబ్ సింగ్, లక్ష్మణ్, రమేశ్, ఇస్తారి, మనోహర్, ఆయా పాఠశాలల వార్డెన్లు పాల్గొన్నారు.


