చలికి గజ గజ
దండేపల్లి: జిల్లాలో గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి వణికిస్తోంది. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైపూర్ మండలంలో 9.3, కోటపల్లి, వేమనపల్లి మండలం నీల్వాయిలో 9.5, జన్నారంలో 9.6, కోటపల్లి మండలం దేవులవాడ, భీమారం మండల కేంద్రంలో 9.9, మందమర్రి మండలం అందుగులపేటలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. జిల్లా అంతటా 11.8 డిగ్రీల కంటే తక్కువగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలికి వణికిపోతున్నారు. సాయంత్రం 5గంటలు దాటితే చాలు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 9గంటలు దాటినా చలి ప్రభావం తగ్గడం లేదు. దీంతో బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. చలి నుంచి ఉపశమనానికి కొందరు రాత్రివేళ రోడ్ల పక్కన చలిమంటలు కాగుతున్నారు. మరికొందరు ఉన్ని దుస్తులు ధరించి బయటకు వస్తున్నారు.


