తప్పులు సవరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం
భైంసాటౌన్: మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితా తప్పులతడకగా ఉందని ఆరోపిస్తూ ప్రజావేదిక, మహిష ఆధ్వర్యంలో గురువారం భైంసా పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ చౌరస్తా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ ఓటరు ముసాయిదా జాబితాలో ఒక వార్డులోని ఓట్లు మరోవార్డులో, ఒక వార్డులో ఒకే ఇంటి నంబర్‌పై పదుల సంఖ్యలో మరోవర్గం ఓట్ల నమోదు.. లాంటి తీవ్రమైన లోపాలున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ట్యాక్స్ రికార్డుల్లో లేని ఇంటి నంబర్లతో ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. తప్పులు సవరించుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్పందించిన సబ్ కలెక్టర్ అభ్యంతరాలను రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. బోగస్ ఓట్ల తొలగింపు కోసం నిర్ణీత ఫాంలను భర్తీ చేసి అందించాలని తెలిపారు.


