గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత
మంచిర్యాలఅర్బన్: అపార విజ్ఞానానికి నిలయాలైన గ్రంథాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. ఏళ్లతరబడి ఖాళీలను భర్తీ చేయకపోవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గ్రంథాలయాలకు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్రంథాలయాలు తెరిచే ఉంటున్నాయి. వందలాది మంది పాఠకులు వస్తుండటంతో పుస్తకాలపై పర్యవేక్షణ కష్టతరమవుతోంది. గ్రంథాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇలా..
మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయం 1960లో ఏర్పాటైంది. దీనిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేశారు. ఉద యం 8నుంచి రాత్రి 8గంటల వరకు నిర్వహించా ల్సిన దీనిని రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచాల్సి వస్తోంది. ప్రతీరోజు గ్రంథాలయానికి వచ్చే పాఠకులు 300 మందికి పైనే ఉంటున్నారు. పోటీ పరీక్షల కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు 100 నుంచి 200మంది వరకు ఉంటారు. గ్రంథాలయంలో అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కార్యదర్శితోపాటు ఇద్దరు లైబ్రేరియన్లు, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, అంటెడర్, వాచ్‌మెన్‌ను నియమించాల్సి ఉంది. దీనిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేసినా కార్యదర్శి పోస్టు రోజుల తరబడి ఖాళీగానే ఉంది. లైబ్రేరియన్‌ను జన్నారం నుంచి, ఇద్దరు ఔట్ సోర్సింగ్‌కు చెందిన అటెండర్లను బెల్లంపల్లి, మందమర్రి నుంచి సర్దుబాటు చేశారు.
పాఠకులకు పుస్తకాలిచ్చేవారేరి?
జిల్లాలో 15 గ్రంథాలయాలున్నాయి. ఇందులో బె ల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల గ్రేడ్–2 గ్రంథాలయాలున్నాయి. వీటిలో సుమారు 1,07,900 పుస్తకాలున్నాయి. దినపత్రికలతో పాటు వివిధ రకాల వార, పక్ష, మాసపత్రికలు, వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బాలసాహిత్యం, గణి తం, సైన్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇతిహాసాలు, జీవితచరిత్రలు, నవలా సాహిత్యం, ఆధ్యాత్మిక గ్రంథాలూ ఉన్నాయి. పాలిసెట్ నుంచి ఇతర పోటీ పరీ క్షలు రాసేందుకు ఉపయోగపడే పుస్తకాలున్నాయి. 3,842 మంది పాఠకులున్న లైబ్రరీల్లో సిబ్బంది కొరత కారణంగా పుస్తకాలు ఇంటికి ఇవ్వడంలేదని తెలుస్తోంది. దీంతో పాఠకుడు ఏ పుస్తకం చదవాలనుకున్నా గ్రంథాలయాల్లోనే చదవాల్సి వస్తోంది.
ఇన్‌చార్జీలతో ఇబ్బందులు
గ్రంథాలయాల్లో ఇన్‌చార్జీలతో ఇబ్బందులెదురవుతున్నాయి. జన్నారంలో విధులు నిర్వహించే లైబ్రేరియన్‌ను కీలకమైన కేంద్ర గ్రంథాలయం మంచిర్యాలతో పాటు, దాదాపు 120 కిలోమీటర్ల పైన దూరం ఉండే వేమనపల్లి, కోటపల్లికి డిప్యూటేషన్ ఇవ్వటంతో కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అంబేడ్కర్ స్టడీ సెంటర్, బ్రాంచ్‌లకు పుస్తకాల పంపిణీ లైబ్రరీయన్ వర్క్ భారంతో మినహాయింపు ఇవ్వాలని, మంచిర్యాల ఇన్‌చార్జి రద్దు చేసి ఒరిజనల్ పోస్టింగ్ జన్నారానికి మాత్రం బాధ్యతలు అప్పగించాలని కోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లకు పైగా డిప్యూటేషన్లు కొనసాగుతుండటం గమన్హారం. జెపూర్‌కు చెందిన లైబ్రేరీయన్‌కు చెన్నూర్‌కు డిప్యూటేషన్, కాసిపేట్ నుంచి బెల్లంపల్లి డిప్యూటేషన్, మందమర్రి నుంచి నెన్నెలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దండేపల్లి లైబ్రేరియన్‌కు మినహాయింపు ఇచ్చారు. భీమిని అవుట్ సోర్సింగ్ లైబ్రేరియన్‌కు తాండూర్ ఇన్‌చార్జీగా, లక్సెట్టిపేటలో పార్ట్‌టైం వర్కర్‌తో వెల్లదీస్తున్నారు. భీమారం విలేజీ లైబ్రరీ పార్ట్‌టైం వర్కర్‌ను వయస్సు మిరిపోయిందని చెప్పాపెట్టకుండా పక్కన పెట్టారు. దీంతో స్వీపరే పెద్ద దిక్కుగా మారింది.
ముగ్గురు అవుట్ సోర్సింగ్ అటెండర్లే..
జిల్లాలో రెగ్యులర్ అటెండర్లు ఐదుగురుండాల్సిన చోట ఒక్కరినీ నియమించలేదు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ అటెండర్లు ముగ్గురు మాత్రమే విధులు ని ర్వహిస్తున్నారు. ఉన్న అటెండర్లు కూడా బెల్లంపల్లి అటెండర్‌ను మంచిర్యాలకు డిప్యూటేషన్, చెన్నూర్ అటెండర్‌ను మంచిర్యాలకు, మంచిర్యాల అటెండర్‌ను బెల్లంపల్లికి డిప్యూటేషన్ ఇవ్వటంతో మిగిలిన చోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. మంచిర్యాలలో స్వీపర్ తాత్కాలిక ఉద్యోగిగా నెట్టుకొస్తున్నారు.
ఒక్కరికే ఆరు బాధ్యతలు
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా సరిత ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. కరీంనగర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సరితకు మంచిర్యాల ఇన్‌చార్జితో పాటు పెద్దపల్లి, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్లకు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ యూడీసీని మంచిర్యాల ఇన్‌చార్జిగా నియమించారు. ఇదివరకు గ్రంథాలయ సంస్థ పాలకవర్గం గడువు ముగియటంతో అప్పట్లో అదనపు పాలనాధికారి రాహుల్ పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగగా ఆయన ప్రమోషన్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుత కలెక్టర్ కుమార్ దీపక్ పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెండేళ్లకుపైగా పాలకవర్గం లేకుండాపోయింది. కొత్త పాలకవర్గం వచ్చేంత వరకు పదవిలో కొనసాగనున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న గ్రంథాలయ ఉద్యోగుల డిప్యూటేషన్లతో పాటు ప్రస్తుత పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుపై ప్రత్యేక చొరవ చూపాలని పాఠకులు కోరుతున్నారు.


