భర్త బాటలో గంజాయి రవాణా
నిజామాబాద్‌అర్బన్: భర్త చేస్తున్న అక్రమ గంజాయి రవాణాను గమనించింది. కొన్నిసార్లు తోడుగా వెళ్లి గంజాయి రవాణాలో భాగమైంది. కొన్నేళ్లపాటు ఇద్దరూ అక్రమ దందాను కొనసాగించారు. అయితే, రెండు నెలల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోగా, భార్య మాత్రం గంజాయి రవాణా కొనసాగిస్తోంది. తీరా నిజామాబాద్‌లో ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడటంతో ఆమె వ్యవహారం బట్టబయలైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవులతండా గ్రామానికి చెందిన పూజా పవార్ గురువారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గంజాయితో పట్టుబడింది. ఆమె భర్త దేవ్‌రాజ్ కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా కొనసాగించి రెండు నెలల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలున్న పూజా పవార్ కుటుంబ పోషణ కోసం భర్త కొనసాగించిన మార్గాన్ని అనుసరించింది. ఆమెకు ఆదిలాబాద్ జిల్లా కుప్టి(కే) గ్రామానికి చెందిన దుర్పాద బాయి జాదవ్ తోడైంది.
మధ్యప్రదేశ్ టూ నిజామాబాద్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిర్‌పూర్ పట్టణంలో కిలో గంజాయి ధర తక్కువగా ఉండడంతో పూజా పవార్, దుర్పాద బాయి జాదవ్ కొనుగోలు చేస్తుంటారు. అనంతరం ఆ గంజాయిని మహారాష్ట్రలోని కిన్వట్‌కు తరలించి, మధ్యవర్తులైన కిషన్ మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రెల ద్వారా నిజామాబాద్‌కు సరఫరా చేస్తుంటారు. గత నెలలో నిజామాబాద్‌కు వచ్చిన వారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్‌కు చెందిన వెంకట్‌రామ్‌కు గంజాయి విక్రయించారు. ఆ గంజాయిని వెంకట్‌రామ్ జిల్లా కేంద్రంలో ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 7.30 కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నలుగురు వ్యక్తులు గంజాయితో బస్సు దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎకై ్సజ్ శాఖ నిజామాబాద్ ఎస్‌హెచ్‌వో స్వప్న తన సిబ్బందితో మఫ్టీలో కాపుకాశారు. బస్సు దిగగానే అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగులను తనిఖీ చేశారు. అందులో 13కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్ శాఖ సూపరిండెంట్ మల్లారెడ్డి విలేకరులకు వెల్లడించారు. గంజాయి కొనుగోలు చేస్తున్న వెంకట్‌తోపాటు మహారాష్ట్రకు చెందిన కిషన్‌మోతీరాం దాలే, ఇంద్రజిత్ టాగ్రె, పూజా పవార్, దుర్పాదబాయి జాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులకు చెందిన ఐదు సెల్‌ఫోన్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న, ఎస్సై మల్లేశ్, సుష్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ తదితరులున్నారు.


