అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి ఐదు కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లిలోని శ్మశానవాటిక ప్రాంతంలో ఈ నెల 7న మధ్యాహ్నం అంతర్రాష్ట్ర ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. గోనె సంచుల్లో దాచిన 5.230 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.30లక్షలు ఉంటుంది. నిందితుల్లో ఇంద్రవెల్లిలోని గంగాపూర్‌కు చెందిన బస్సి సంతోష్, దస్నాపూర్‌కు చెందిన జవాడే శంకర్, భీంనగర్‌కు చెందిన షేక్ ఖాజా, ఆసిఫాబాద్‌లోని జైనూర్‌కు చెందిన సయ్యద్ సాబిర్, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన గిరీశ్ విఠల్ దొంట, షేక్ షరీఫ్ ఇర్షాద్‌ను అరెస్ట్ చేశారు. పుట్టలొద్ది గ్రామానికి చెందిన ఆత్రం బాదిరావు పరారీలో ఉన్నాడు. ఇంద్రవెల్లికి చెందిన బస్సి సంతోష్, జవాడే శంకర్ స్థానికంగా గంజాయి విక్రయిస్తుంటారు. వీరికి సయ్యద్ సాబిర్ అనే వ్యక్తి గంజాయి కొనుగోలుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. షేక్ ఖాజా గంజాయి నిల్వలు దాచడం, విక్రయాలకు పాల్పడుతున్నాడు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా కోసం మహారాష్ట్రకు చెందిన గిరీశ్ విఠల్ నిందితులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. తక్కువ ధరకు తీసుకువచ్చి విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ గ్యాంగ్ ద్విచక్ర వాహనాలపై చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇంద్రవెల్లి పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచి సమాచారం సేకరించారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా, గంజాయి విక్రయాలకు సంబంధించిన రికార్డులు లభించాయి. ఏడాదిగా నిందితులు గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంద్రవెల్లితో పాటు ఇతర మండలాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా, సాగు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, ఎస్సై సాయన్న ఉన్నారు.


