అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సవ్యసాచిఘోష్ సూచించారు. గురువారం హైదరాబాద్ గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, టీసీ ఆర్టీఎన్టీ సంచాలకులు సమజ్వాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉట్నూర్ ఐటీడీఏలో పీవో యువరాజ్ మర్మాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, కాస్మొటిక్ చార్జీలు పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఇనిస్టిట్యూట్లకు వివిధ రకాల మరమ్మతు పనుల కోసం రూ.79.61కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు సరి చేసుకోకుంటే ప్రధానోపాధ్యాయులు, సంక్షేమాధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 16, 17లో న్యూఢిల్లీ నుంచి గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఐటీడీఏ నుంచి వివిధ వృత్తులు చేసుకునే 25మంది గిరిజనులను ఎంపిక చేసి పంపించాలని సూచించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్న గిరిజన రైతుల ఆధార్ జనరేషన్ కాక రైతు భరోసా, ఇతర పంట రుణాలు రావడం లేదని, ఐటీడీఏల వారీగా త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమశాఖ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు అందరికీ అందేలా చూస్తామని పేర్కొన్నారు. జీపీఎస్ పాఠశాల కోసం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించి ఫిబ్రవరి 15వరకు పూర్తి చేస్తామని తెలిపారు. పోడు పట్టా కలిగిన రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి వారికి రైతు భరోసా, బ్యాంక్ ద్వారా ఇతర రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


