నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన మీ సేవ ఆపరేటర్ అరెస్ట్
గుడిహత్నూర్: కల్యాణలక్ష్మి పథకం కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి లబ్ధిపొందాలని చూసిన మండల కేంద్రానికి చెందిన మీ సేవ ఆపరేటర్ ములజ్‌కర్ శరత్, మండలంలోని మన్నూర్ గ్రామానికి చెందిన జాదవ్ గణేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ కాజల్ తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మన్నూర్‌కు చెందిన ఇంగ్లే అంకుష్, కదం శ్యాంసుందర్ వీరిద్దరు తమ కూతుళ్లకు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేశారు. అయినా కల్యాణలక్ష్మి కింద ఆర్థికసాయం పొందాలని చూశారు. ఇదే గ్రామానికి చెందిన జాదవ్ గణేశ్ కొంత నగదు ఇస్తే పథకం డబ్బులు వచ్చేలా చూస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.20వేలు తీసుకుని వారి కూతుళ్ల ఆధార్ కార్డులు, నకిలీ బోనఫైడ్‌లు తయారు చేసి అందులో వారి వయస్సు మార్చి పోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేశాడు. ఈ తతంగం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా వీరు మోసాలకు పాల్పడుతున్నట్లు బట్టబయలైంది. దీంతో వీరు తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు, వారి వద్ద ఉన్న కంప్యూటర్ పరికరాలు, వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీ సేవ ఆపరేటర్ ములజ్‌కర్ శరత్, జాదవ్ గణేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరం చేయడానికి సహకరించిన ఇంగ్లే అంకుష్, కదం శ్యాంసుందర్‌ను కూడా మైనర్ బాలికలకు వివాహం చేసిన నేరానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిద్దరు ప్రస్తుతం పరారీ ఉన్నారు. ఇలా సామాన్యులను మభ్యపెట్టి మోసాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బాధితులుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని ఏఎస్పీ సూచించారు. సీఐ రమేశ్, ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.


