కలమడుగు గోదావరికి మెస్రం వంశీయులు
జన్నారం: నాగోబా మహాపూజకు అవసరమైన గోదావరి జలాల కోసం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన మెస్రం వంశీయులు మంగళవారం రాత్రి జన్నారం మండలంలోని నర్సింగపూర్‌లో బస చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు కలమడుగు గోదావరికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అక్కడే దంపుడు బియ్యం, పప్పుతో భోజనం చేశారు. అనంతరం గోదావరిలోని హస్తినమడుగులో కలశాన్ని శుభ్రం చేసి అందులో నీటిని నింపారు. జాడీలను కర్రలకు కట్టి పూజలు చేసి కేస్లాపూర్‌కు తిరుగుపయనం అయ్యారు. ఈ నెల 9న జైనూర్ మండలంలోని గౌరి గ్రామంలో చెట్టుపై కలశాన్ని భద్రపరుస్తారు. 13న తిరిగి కలశాన్ని తీసుకుని కేస్లాపూర్ బయలుదేరనున్నట్లు కటోడ హన్మంతరావు తెలిపారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మారుతి, తిరుపతి, కలమడుగు, వెంకటపూర్ గ్రామాల సర్పంచులు బొంతల నాగమణి మల్లేశ్, మెస్రం రాజుకుమార్ పాల్గొన్నారు.


