సరదా.. కారాదు విషాదం
మంచిర్యాలటౌన్: సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పతంగులు. పండుగకు గాలిపటాలు ఎగురవేసేందుకు చిన్నాపెద్దా ఆసక్తి కనబరుస్తారు. పతంగులను ఎగురవేసేందుకు గానూ వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి మాంజాలను తెప్పించి విక్రయిస్తుంటారు. కొంతమంది ప్లాస్టిక్‌తో తయారు చేసిన చైనామంజాను విక్రయిస్తుండడంతో కొనుగోలు చేసేందుకు చిన్నారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మాంజాతో కూడిన దారం వల్ల పక్షులు, జంతువులతో పాటు, ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చైనామాంజాను నిషేధిస్తూ 2016 జనవరి 13న జీవో విడుదల చేశాయి. ఈ జీవో అమలులో భాగంగా అటవీ, పోలీస్ శాఖ అధికారులు తరచూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి చైనామాంజా విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. చైనామాంజా అమ్మితే ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలువురు వ్యాపారులు అధికారుల కళ్లుకప్పి విక్రయాలు సాగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాలతో చెలగాటం
గాలి పటాలు ఎగురవేసేటప్పుడు ఒకరి పతంగి కంటే మరొకరి పతంగి ఎత్తులో ఎగరాలని, ఆకాశంలో ఉండగానే ఎదుటివారి పతంగిని కట్ చేయాలని చూస్తుంటారు. ఇందుకోసం కొంతమంది నిషేధిత చైనామాంజాను వాడుతున్నారు. ఈ దారం తయారీలో గాజుపొడి, నైలాన్, సింథటిక్, హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఈ దారం పతంగులను కట్ చేయడమే కాకుండా మనుషులకు, పక్షులకు, జంతువులకు తగిలితే కత్తితో కోసినట్లుగా కట్ చేసేస్తుంది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై రోడ్డుపై వెళ్తుండగా చైనామాంజా తాకి గాయాలై మృతి చెందిన సంఘటనలు ఏటా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి.


