యథేచ్ఛగా మద్దిచెట్ల నరికివేత
కోటపల్లి: మండలంలోని కొత్తపల్లి, రాజారం, పార్‌పల్లి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పట్టుపురుగుల పెంపకం కొరకు ఆదివాసీ రైతులకు కేటాయించిన మద్దిచెట్లు నరికివేతకు గురవుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు విచ్చలవిడిగా చెట్లును నరికివేస్తుండగా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫలితంగా పట్టుపురుగుల పెంపకం ప్రశ్నార్థకంగా మారడంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంటి అవసరాలకు చిన్నచిన్న కట్టెపుల్లలను తీసుకెళ్తేనే కేసులు నమోదు చేసే అటవీశాఖ అధికారులు మద్దిచెట్లను నరికేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదని పేర్కొంటున్నారు. పట్టుపురుగుల పెంపకం చేపట్టవద్దని ఇటీవల అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల జీవనోపాధికి ఇబ్బందులు కలిగించవద్దని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పట్టుపురుగుల పెంపకం నిలిచిపోయేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆదివాసీ రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ఎఫ్‌డీవో సర్వేశ్వర్‌ను వివరణ కోరగా అటవీ ప్రాంతంలో చెట్లను నరికేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్దిచెట్లను నరికేస్తున్న విషయం మాదృష్టికి రాలేదన్నారు.


