ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో బ్రాంజ్‌మెడల్
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన పుప్పాల స్వాతి క్రీడారంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. గ్రామానికి చెందిన రైతు పుప్పాల రాజేశ్వర్, హేమలత దంపతుల కుమార్తె అయిన స్వాతి కరీంనగర్‌లోని నిగమా కళాశాలలో బీపీఈడీ పూర్తి చేసింది. గత నెల 27, 28 తేదీల్లో తమిళనాడులోని ఈరోల్‌లో జరిగిన 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ బెంచ్ రెస్ట్ షూటింగ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించింది. చిన్ననాటి నుంచి చదువుతో పాటు క్రీడారంగంలో ఆసక్తి ఉన్న స్వాతి జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అవుతూనే కరీంనగర్‌లోని ఢిల్లీ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమిలో శిక్షణ సైతం అందిస్తోంది. క్రమశిక్షణ, పట్టుదలతో రాణిస్తే మనం అనుకున్న రంగంలో విజయాలు సాధించవచ్చని స్వాతి ‘సాక్షి’తో తెలిపింది.


