విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి
సిర్పూర్(టి): విద్యుత్ కంచె తగలడంతోనే టోంకిని గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్, సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ స్పష్టం చేశారు. యువకుడి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సిర్పూర్(టి) పోలీసుస్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలం టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్(19) ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గ్రామ సమీపంలోని తమ సొంత పొలం చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ప్రమాదవశాత్తు తగిలి మృతి చెందాడు. జయేందర్ తండ్రి చౌదరి చిరంజీవి, పక్క పొలం యజమాని జయరాం పొలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. విద్యుత్తు లైన్ తగిలి మృతి చెందడంతో తమపై కేసు నమోదవుతుందనే భయంతో ఇద్దరు కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న పెన్‌గంగ నదిలో పడేశారు. ఆ తర్వాత చిరంజీవి సిర్పూర్(టి) పోలీసుస్టేషన్‌లో తన కుమారుడు చౌదరి జయేందర్ ఇంటి నుంచి బయటి వెళ్లి తిరిగి రాలేదని అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ నెల 12న పెన్‌గంగ నదిలో మృతదేహాన్ని కొందరు భక్తులు గుర్తించారు. పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయేందర్ మృతదేహాన్ని అతడి తండ్రితోపాటు జయరాం నదిలో పడేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చౌదరి చిరంజీవి, జయరాంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి


