బలహీన వర్గాల ఆశాజ్యోతి ‘పూలే’
● సమాజ మార్పుకు కృషి చేసిన మహోన్నతుడు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మాజ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువు లేకపోవడమే బలహీనవర్గాల అణిచివేత, వివక్షకు కారణమని, అందరికీ విద్యనందించే దిశగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి రహిత
పంచాయతీలుగా మార్చాలి
మంచిర్యాలఅగికల్చర్: జిల్లాలో టీబీ, క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీలుగా మార్చాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఇన్‌చార్జి జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల అధికారి పురుషోత్తంలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15, 16న గ్రామాల్లో ఆరేళ్లలోపు పిల్లల బరువు, ఎత్తు ఎదుగుదలపై కార్యదర్శులు పర్యవేక్షించాలని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సీడీపీవోలు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
భీమిని: ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టి స్థానికంగానే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని అన్నారు. కన్నెపల్లి, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో శంకర్, ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 14 అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌లతో కలిసి జిల్లా అధికారులతో జయంతి వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 14, 15న డిప్యూటీ సీఎం, మంత్రులు మంచిర్యాలలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ, అధికారులకు సూచించారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు.
విగ్రహం పనులు పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన ఐబీ చౌరస్తాలో పనులు పరిశీలించి సూచనలు చేశారు.


