వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగురు మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు, చికిత్స పొందుతూ వృద్ధుడు, మద్యానికి బానిసై మరొకరు మృతిచెందారు.
దిలావర్‌పూర్: మండలంలోని న్యూలలోం సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. నిర్మల్–భైంసా రహదారిపై కాల్వ ఆలయ స్వాగత తోరణం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందగా వాహనదారులు గమనించి ఎస్సై సందీప్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని ప్రమాదం తీరుపై ఆరా తీశారు. మృతుడు నర్సాపూర్(జి) మండలం బామ్ని గ్రామానికి చెందిన గోడ్పె కిషన్‌రావు (55)గా గుర్తించారు. నిర్మల్ పట్టణానికి వెళ్లి కాలినడకన రోడ్డు గుండా వస్తుండగా వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధుడు..
మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో మద్యం మత్తులో గుర్తుతెలియని పురుగుల మందు తాగిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏఎస్సై బి.సత్తయ్య కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని అశోక్‌రోడ్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జింక దుర్గయ్య(71) గత కొంతకాలంగా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చూపించగా లివర్ పాడైపోయిందని వైద్యులు చెప్పారు. అయినా దుర్గయ్య మద్యం తాగేవాడు. జీవితంపై విరక్తితో ఈనెల 28న మద్యం మత్తులో గుర్తుతెలియని పురుగుల మందు తాగి భార్య సమ్మక్కకు విషయం చెప్పాడు. వెంటనే మంచిర్యాల ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతు ఆ దివారం మృతిచెందాడు. మృతురాలి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
తాగుడుకు బానిసై వ్యక్తి..
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బోయ ర్ దేవిదాస్ (55) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పట్టణంలోని రోడ్లపై తిరుగుతూ జీవనం సాగించేవాడు. ఆదివారం భుక్తాపూర్‌లోని బి–రాములు కాంప్లెక్స్ సమీపంలో గల ఓ తోపుడుబండిపై చనిపోయి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించగా మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈమేరకు వన్‌టౌన్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


