
క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి, చెన్నూర్‌లో చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1,278 కేసులు గుర్తించి 871 మందికి మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ పథకంలో భాగంగా జిల్లాలో ఏడు ముక్త్ గ్రామ పంచాయతీలను నిర్ణయించామని, వాటిలో చెన్నూర్ మండలం పొక్కూర్, కాసిపేట మండలం పల్లంగూడ, వేమనపల్లి మండలం సుంపుటం, జైపూర్ మండలం నర్వ, హాజీపూర్ మండలం పడ్తనపల్లి, భీమిని మండలం వీగాం, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు. క్షయ వ్యాధి నివారణలో ఉత్తమ సేవలు అందించిన 22 మంది వైద్యులు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు ప్రదానం చేశారు. హిందూ సేవక్ సమాజ్, పెన్నిధి వాలంటరీ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు భీష్మ, ప్రోగ్రామ్ అధికారి సుధాకర్‌నాయక్, అధికారులు అనిత, సీతారామరాజు, ప్రసాద్, హరిశ్చంద్రారెడ్డి పాల్గొన్నారు.
వడదెబ్బ నుంచి రక్షణకు
జాగ్రత్తలు తీసుకోవాలి
నస్పూర్: వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సోమవారం మంచిర్యాల ఆర్‌డీఓ శ్రీనివాసరావు, జిల్లా ఆరోగ్య వైద్యాధికారి హరీష్‌రాజ్, అధికారులతో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా త్రిసభ్య కమిటీలో వైద్యాధికారి, ఎస్సై, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారని, వడదెబ్బ కేసుల వివరాలు, మరణాలు ధ్రువీకరిస్తారని తెలిపారు. జిల్లాలో ఎస్‌సీడీ నోడల్ అధికారిగా డాక్టర్ ప్రసాద్‌ను నియమించినట్లు తెలిపారు. అనంతరం వడదెబ్బ నియంత్రణ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అధికారులు పురుషోత్తం నాయక్, తిరుపతి, సుదానాయక్, అనిత, సీతారామరాజు, అనిల్, బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.