
ఆధునికీకరణ పూర్తయ్యేదెప్పుడో!
● రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యం ● దుమ్ముతో నిండిన ప్లాట్‌ఫాంలు ● రెండేళ్లయినా పూర్తి కాని నిర్మాణాలు ● ఇబ్బందుల్లో బాసర యాత్రికులు
భైంసా: అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన బాస ర రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో బాసరలోని సరస్వతీ అమ్మవారి దర్శనానికి వస్తున్న యాత్రికులకు ఇబ్బందులు తప్పడంలేదు. బాసర రైల్వేస్టేషన్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దున ఉండడం, ఇక్కడ శ్రీజ్ఞానసర్వతీ ఆలయంతోపాటు ట్రిపుల్‌ఐటీ ఉండటంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. అమృత్ భారత్ కింద ఎంపికై న బాసర స్టేషన్ ఆధునికీకరణ పనులను 2024 ఫిబ్రవరి 26న అప్పటి ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్రం అమృత్ భార త్ నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన సాగుతుండటంతో వీరికి ఇబ్బందులు తప్పడంలేదు. ఆధునికీకరణలో భాగంగా స్టేషన్‌లో వెయిటింగ్ హాల్, టాయిలెట్స్ నిర్మాణం, ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు పనులు చేస్తున్నారు. స్టేషన్‌లో యా త్రికులు సేదతీరేందుకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపట్టగా ఇప్పటికీ పునాది దశలోనే ఉన్నాయి. రైల్వేస్టేషన్ ముందు భాగాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సి ఉండగా ప్రస్తుతం ఇసుక, కంకర, మట్టి కుప్పలతో నిండిపోయి కనిపిస్తోంది.
పాత ప్లాట్‌ఫాంలు తొలగించి..
ఆధునికీకరణలో భాగంగా బాసర స్టేషన్ పాత ప్లాట్‌ఫాంలు తొలగించారు. మళ్లీ టైల్స్ వేసి పూర్తి గా ఆధునికీకరిస్తున్నారు. రెండు వైపులా ఈ పనులు అర్ధంతరంగా నిలిచాయి. స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫాంలుండగా ఇరువైపులా పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నిలబడే పరిస్థితి లేదు. ప్లాట్‌ఫాంలపై వివిధ బోగీలను సూచించే ఎలక్ట్రానిక్ మానిటర్లు తొలగించారు. ప్లాట్‌ఫాంలపైకి వచ్చే రైలులోని ఏ బోగి ఎక్కడ నిలుస్తుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.
సరిహద్దులోని రైల్వే స్టేషన్..
ప్రయాణికుల పరేషాన్
బాసర రైల్వేస్టేషన్ తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడి ట్రిపుల్‌ఐటీలో 9 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారు. ఇందులో పనిచేసే అధ్యాపకులు, ఆయా విభాగాల సిబ్బంది రైలు మార్గం ద్వారా రాకపోకలు కొనసాగిస్తారు. ఉత్తర, దక్షిణ భారతాలను కలుపుతూ బాసర మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో నిత్యం సుమారు 4వేలకు పైగా ప్రయాణికులు వెళ్తుంటారు. ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతుండగా నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఆధునికీకరణ పూర్తయ్యేదెప్పుడో!

ఆధునికీకరణ పూర్తయ్యేదెప్పుడో!