● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ● గుట్టుచప్పుడు కాకుండా పార్క్ మూసివేసిన అధికారులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ పార్క్‌లో కాలక్షేపానికి ఆడుకునేందుకు వెళ్లిన విద్యార్థిని పాము కాటువేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూర్ పట్టణంలోని లైన్‌గడ్డ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న శనివారం సాయంత్రం అతని స్నేహితులతో కలిసి పార్కులో ఆడుకుంటుండగా సమీర్‌ను పాము కాటు వేసింది. ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రాణాలతో బయటపడ్డాడు.
పార్క్ మూసివేత
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కనే ఉన్న కేసీఆర్ పార్క్‌లో పాములు సంచరిస్తున్నా అధికారులు పట్టి ంచుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చోటు చేసుకున్న ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విద్యార్థిని పాముకాటు వేసిన ఘటన వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పార్క్ మూసి వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పార్కులో అంతర్గత పనుల నిర్వహణ కారణంగా మూసివేసినట్లు అధి కారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.