జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలతో పాటు సర్వీస్ బుక్‌లో నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో భూ, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర సమస్యలపై 89 ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
నేడు భారీగా మొక్కలు నాటాలి
వన మహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా భారీగా సామూహిక మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి మండలం, గ్రామం, పట్టణానికి లక్ష్యాలు నిర్దేశించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
27న గ్రామ, వార్డు సభలు
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ వారంలో సంబంధిత ఓటర్లకు నోటీసులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సభల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, ఆర్‌డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఏఓ గోవింద్‌నాయక్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరుకావాల్సిందే: కలెక్టర్
గైర్హాజరైన ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ
ఈ వారం గ్రీవెన్స్‌కు 89 ఫిర్యాదులు


