● లోక్ అదాలత్‌లో డ్రంకన్‌డ్రైవ్, ఈ–పెట్టీ, ట్రాఫిక్ చలాన్ కేసులపై ప్రత్యేక దృష్టి
● న్యాయమూర్తి ఈశ్వరయ్య సూచన
పాలమూరు: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ శాఖ చొరవ చూపాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఈశ్వరయ్య సూచించారు. సోమవారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తులు, ఎస్పీ డి.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, నగర సీఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులతో పాటు డ్రంకన్‌డ్రైవ్, ఈ–పెట్టీ, ట్రాఫిక్ చలాన్ కేసులను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కక్షిదారులను గుర్తించి నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా కోర్టు డ్యూటీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. న్యాయమూర్తులు మమతరెడ్డి, మహ్మద్ మునవర్ హుస్సేన్, రవిశంకర్, అనిత, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, సీఐలు పాల్గొన్నారు.


