జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
● మార్కెట్, కొనుగోళ్లు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
● పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌స్తంభాలు
● అకాల వర్షం వల్ల అన్నదాతలకు అపార నష్టం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/జడ్చర్ల టౌన్/మహమ్మదాబాద్/గండేడ్/అడ్డాకుల/భూత్పూర్: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురవడంతో రైతులు పంట నేలపాలైంది. జిల్లాలో జడ్చర్ల, దేవరకద్ర, హన్వాడ, నవాబుపేట, మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, మూసాపేట, అడ్డాకుల, భూత్పూర్ మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మేందుకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆకాశం మేఘామృతమై ఈదురుగాలులు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకునేందుకు ప్రయత్నించగా.. ఈదురు గాలు లు, వర్షం ధాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బందిపడ్డారు. చాలాచోట్ల కాంటా వేసిన బస్తాలు తడిసి పోయాయి. రాశుల కిందికి వర్షపు నీరు చేరింది.
● జిల్లా కేంద్రంలో సాయంత్రం 5.45గంటల నుంచి 6.15 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12 విలీన గ్రామాలలోని మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారాయి. జడ్చర్లలోని గంగాపురం రోడ్డులో ఉన్న కాటన్‌మార్కెట్‌లో ధాన్యం తడిసిపోగా.. పట్టణంలో పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లకొమ్మలు కరెంట్ వైర్లపై తెగిపడడంతో విద్యుత్‌సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాటన్ మార్కెట్‌లో కొద్దిరోజులుగా మొక్కజొన్నలు కొనుగోళ్లు ఆలస్యం కావటంతో పెద్ద ఎత్తున యార్డులోనే రైతులు అక్కడే ఆరబోసి పెట్టారు. అకస్మాత్తుగా వర్షం రావటంతో మక్కలు, వరి కొట్టుకుపోంది. తమ పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. సంచుల్లో ఉన్న ధాన్యం, మక్కలు సైతం తడిపిముద్దయ్యాయి. వర్షం తగ్గిన తరువాత కొట్టుకుపోయిన ధాన్యంను చాటలతో తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు.
● మహమ్మదాబాద్ మండలంలో నంచర్ల కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొకర్లాబాద్ గాధిర్యాల్ రోడ్డుపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. గండేడ్ మండలంలోని బల్సుర్‌గొండ, రంగారెడ్డిపల్లి, వెన్నాచేడ్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిపోయింది. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి.
● అడ్డాకుల, మూసాపేట మండలాల్లో రోడ్లు, పొలాల వెంట రైతులు నిల్వ చేసిన వరి ధాన్యం తడిసి పోయింది. ఇంకా వరి కోతలు పూర్తి కాని చోట పంట నేలకొరిగింది. భూత్పూర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.


