ఆటల్లో మేటి.. ఫుట్‌బాల్‌తో సాటి | - | Sakshi
Sakshi News home page

ఆటల్లో మేటి.. ఫుట్‌బాల్‌తో సాటి

May 14 2026 12:49 AM | Updated on May 14 2026 12:49 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలోని ఔత్సాహిక ఫుట్‌బాల్‌ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందజేసి వారిని మేటీ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఏనుగొండ, జడ్చర్ల మినీ స్టేడియం, కోడ్గల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌, రాజాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌, గార్లపహాడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌, వేపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ ఆవరణలో ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణా శిబిరాల్లో 150కిపైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణా శిబిరాలను జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్‌ పర్యవేక్షిస్తున్నారు.

గార్లపహాడ్‌లో 40మంది శిక్షణ

కోయిలకొండ మండలం గార్లపహాడ్‌లో వేసవి ఫుట్‌బాల్‌ శిబిరంలో దాదాపు 40 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అభంగపట్నం 15మంది, గార్లపహాడ్‌ నుంచి 25మంది శిక్షణకు హాజరవుతున్నారు. వీరిలో 30మంది విద్యార్థులు మొదటిసారి ఫుట్‌బాల్‌ శిక్షణ తీసుకుంటుండడం విశేషం. ఉదయం 6గంటల నుంచి 8:30 గంటల వరకు కోచ్‌లు ప్రేమ్‌కుమార్‌, రాములు విద్యార్థులకు ప్రత్యేక ఫుట్‌బాల్‌ శిక్షణ ఇస్తున్నారు. మొదట ఫిట్‌నెస్‌ అనంతరం బేసిక్‌ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. బాల్‌ టచ్‌, పాసింగ్‌, డ్రిల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. వారంలో ఆరురోజులు సీనియర్‌ రెండు, జూనియర్‌ రెండు జట్లుగా విభజించి మ్యాచ్‌లు ఆడిపిస్తున్నారు. శిక్షణ అనంతరం ప్రతి రోజు అరటిపండ్లు, చిక్కిలు, బిస్కట్లు అందజేస్తున్నారు.

ఫుట్‌బాల్‌ ఆటంటే ఎంతో ఇష్టం. మొదటిసారి వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. శిక్షణ శిబిరంలో రెగ్యూలర్‌గా పాల్గొంటున్న. భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఆడాలని ఉంది. అందుకు నిరంతరం ప్రాక్టిస్‌ చేస్తా. – వర్ష, గార్లపహాడ్‌

ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన జిల్లాస్థాయి సీఎం

కప్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో పాల్గొన్న. ఫుట్‌బాల్‌లో ఎక్కువగా డిఫెన్స్‌ ఆడుతున్న. ఇక్కడ శిక్షణ శిబిరం బాగుంది. కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటా.

– భువనేశ్వర్‌, గార్లపహాడ్‌

వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరంలో మొదటిసారిగా పాల్గొంటున్న. ఫార్వార్డ్‌లో శిక్షణ తీసుకుంటున్న. మా గ్రామంలో ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటా.

– మౌనిక, గార్లపహాడ్‌

శిక్షణా చాలా బాగుంది

వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణ చాలా బాగుంది. కొత్తగా వచ్చిన మాలాంటి వారికి కోచ్‌లు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. ప్రతిరోజు ఫుట్‌బాల్‌ శిక్షణ తీసుకుంటున్న. వేసవి వరకు కాకుండా ఇకనుంచి నిరంతరం ఫుట్‌బాల్‌ ఆడుతా. – గౌతమ్‌, అభంఘపట్నం

వేసవి ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరంలో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొత్తగా వస్తున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ఫిట్‌నెస్‌ చేయించడంతోపాటు బాల్‌ డ్రిల్‌, గేమ్‌పై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.

– ప్రేమ్‌కుమార్‌, కోచ్‌

జాతీయ జట్టుకు ఆడాలని ఉంది

జిల్లాస్థాయి సీఎం కప్‌లో ఆడాను

పాలమూరులో ఆరుచోట్ల ఫుట్‌బాల్‌ వేసవి శిక్షణ శిబిరాలు

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

శిక్షణ పొందుతున్న వందలాది మంది విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement