అన్ని శాఖల్లోనూ ఇదే తీరు.. | - | Sakshi
Sakshi News home page

అన్ని శాఖల్లోనూ ఇదే తీరు..

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

అన్ని శాఖల్లోనూ ఇదే తీరు.. సాక్షి, నాగర్‌కర్నూల్‌:

మ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్‌ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్‌ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

చేయి తడిపితేనే పని..

ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్‌ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, మైనింగ్‌, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement