అలంపూర్: బిందు సేద్యానికి ఉపయోగించే పరికరాలను సకాలంలో శుభ్రం చేసుకోవడం వలన వాటి మన్నిక పెరగడంతో పాటుగా నీటి పారుదల బాగుంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు. వంద అడుగులకు పైగా పడిపోయిన భూగర్భ జలాల నుంచి వచ్చే సన్నటి మన్ను, ఎరువులు బిందు సేద్యం పరికరాలను దెబ్బతిస్తాయన్నారు. తద్వార మోటార్లపై భారం పడి అవి దెబ్బతినే అవకాశం ఉంది.
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత కీలకం
బోరు బావుల నుంచి వచ్చే నీటిలో సన్నటి మన్ను అధికంగా వస్తోంది. దీనివల్ల లేటర్ పైప్‌ల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లేటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్‌ను అమర్చుతారు. దీన్ని వారం రోజులకు ఒక సారి నీటితో శుభ్రం చేయాలి. ఫిల్టర్‌పై సన్నటి రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవాలి. కొత్తగా వేసిన బోర్లు అయితే రోజుకు ఒక పర్యాయం అయినా ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. బావుల నుంచి నీటిని తీసుకుంటున్నప్పుడు సాండ్ ఫిల్టర్‌ను అమర్చుకోవాలి. రెండు ఫిల్టర్ల వల్ల రెండు దఫాలుగా వడపోత జరిగి లేటరల్ పైపుల్లోకి మట్టి చేరకుండా ఉంటుంది.
లెటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్‌మెంట్
బిందు సేద్య పరికరాల ద్వారా అందించే ఎరువులు వల్ల లేటరల్ పైపులకున్న రంధ్రాలు మూసుకుపోతాయి. తద్వార నీరు కిందికి రావడం నిలిచిపోయి మొక్కలకు నీరు అందదు. ఏడాదికి ఒకసారి పైప్‌లను శుభ్రపర్చుకోవాలి. ఇందుకోసం తక్కువ గాఢత గల హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ ఆసిడ్‌ను వాడతారు. ఆసిడ్‌ను ఉపయోగించి పైప్‌లను శుభ్రపరిచేందుకు రెండు పద్ధతులు పాటించవచ్చు. ఎకరా పొలంలో గల లేటరల్ పైప్‌లను శుభ్రపరిచేందుకు 30 నుంచి 40 లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పది మీటర్ల హూస్ పైప్ తీసుకొని రెండు వైపులా కట్టెలను పాతి యూ ఆకారంలో అమర్చాలి. హూస్ పైప్‌నకు ఒక వైపు నుంచి నాలుగేసి లేటరల్ పైప్‌లను జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. ఆపై పైప్‌లను రెండు రోజులపాటు వాడకుండా వదిలేయాలి. మూడో రోజు సబ్ లైన్‌కు బిగించి నీటి వదిలేయాలి. ఆపై ఒక రోజు తర్వాత మొక్కలకు నీరు అందించడానికి పైప్‌లను బిగించాలి.
● రెండో పద్ధతిలో ఎరువులను వదిలే ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చడం. పంట లేని సమయాల్లో మాత్రమే ఈ పద్ధతిని అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంక్‌ను ముందుగా శుభ్రపర్చుకొని, తక్కువ గాఢత గల ఆసిడ్‌ను, తర్వాత నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియ మెల్లగా జరిగే విధంగా చూడాలి. ఆపై గేట్ వాల్స్‌ను నియంత్రిస్తూ ఆసిడ్ ఉన్న నీటిని మెయిన్ లైన్ గుండా సబ్ లైన్ ద్వారా లేటరల్ పైప్‌లకు పంపాలి. ఇందుకోసం ఎక్కడ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇనుప ఫెర్టిగేషన్ ట్యాంక్ ఉన్నట్లయితే వెంచురీ సాయంతో లేటరల్ పైప్‌లను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. దీనివలన ఆసిడ్ ఉన్న నీరు వెళ్తున్న తీరు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అరగంట పాటు ఆసిడ్ ప్రక్రియ సాగితే లేటర్ పైప్‌లకు ఉన్న చిన్న రంధ్రాల్లో మలినాలు తొలగిపోయి పూర్తి స్థాయిలో శుభ్రపడతాయి.
జాగ్రత్తలు
● పంటలు ఉన్న సమయాల్లో ఆసిడ్ ద్వారా పైప్‌లను శుభ్రపర్చరాదు.
● డ్రిప్ కంపెనీలు సూచించిన ఆసిడ్‌ను వారు నిర్ధేశించిన మోతాదు మేరకే వాడాలి.
● నీటిలో ఆసిడ్‌ను కలపాలి. అంతేకాని ఆసిడ్ ఉన్న ట్యాంకులో నీటిని దారపోసే ప్రయత్నం చేయరాదు.
● ఫెర్టిగేషన్ లేదా వెంచురీ సాయంతో ఆసిడ్‌ను పంపేటప్పుడు నీటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
● పైప్‌లు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాప్‌లను తీసేసి ఆసిడ్ కలిపిన నీటిని వదిలేయాలి.
● శుభ్రపరిచిన పైప్‌లను సైతం మరోమారు నీటితో కడగడం లేదా సబ్‌లైన్‌కు బిగించి నీటిని పారనివ్వాలి.
– శుభ్రపరిచే సమయాల్లో రైతులు ముఖానికి, చేతులకు తొడుగులు విధిగా ధరించాలి. వీలైతే చలువ కంటి అద్దాలు వేసుకోవడం ఉత్తమం.
● రసాయనిక ప్రక్రియ కాకుండా అయితే లేటరల్ పైపుల చివరన ఉన్న ఎండ్‌క్యాప్‌లను వారానికి ఒకసారి తీసి పది నిమిషాల పాటు నీటిని వదలాలి. తద్వార లేటరల్ పైప్‌లు శుభ్రపడతాయి. మెయిన్ లైన్ చివరణ గల ఎండ్ క్యాప్‌లను సైతం తీసి ఉంచడం వలన నీటిలో గల మలినాలు శుభ్రపడతాయి.
డ్రిప్ ఫిల్టర్
పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పైపులు
పాడి–పంట


