బోగస్ పత్రాలతో దౌర్జన్యం
● పట్టించుకోని పోలీసులు
● హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన
స్మాట్ సంస్థ చైర్మన్
● న్యాయం చేయాలని వేడుకోలు
గద్వాలటౌన్: సామాజిక బాధ్యతతో ప్రజలకు తాగునీరు అందించే సంస్థ స్మాట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌శ్రీ ఆస్తులపై కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. తప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడం కలకలం రేపుతోంది. దీనిపై స్మాట్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ చైర్మన్ వివరించారు. గద్వాలలో ఉన్న స్మాట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆస్తులను 2022లో వ్యాపార అవసరాల కోసం రాజశేఖర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డిలకు లీజుకు ఇచ్చామన్నారు. లీజు గడువు ముగిసిన తర్వాత ఆస్తులను ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. దీంతో పాటు నకిలీ లీజు ఒప్పందం పత్రాలను సృష్టించి.. దాన్ని ఆధారంగా బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను పొందారని ఆరోపించారు. బోగస్ పత్రాలపై ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే బంధువులం, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనపై బెదిరింపులకు దిగారని చెప్పారు. తమ ఆస్తులపై దౌర్జన్యం చెలాయిస్తూ.. బెదిరింపులకు పాల్పడిన రాజశేఖర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డిలపై స్థానిక రూరల్, టౌన్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. కేసు విషయంపై రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు దౌర్జన్యం చేసిన వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. కేసు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. న్యాయం కోసం తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించాల్సిన అవసరం వచ్చిందన్నారు. హెచ్‌ఆర్సీ త్రీవంగా స్పందించి.. ఎస్పీకి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. తమ సంస్థ ద్వారా 15 ఏళ్లుగా గ్రామాలకు తాగునీరు, ఉపాధి, సాంకేతికతను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాంటి సంస్థకు చెందిన ఆస్తులను కాజేయాలని ప్రయత్నించడం.. వారికి పోలీసులు వంత పాడటం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఎస్పీ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.


