అప్పు ఇవ్వనందుకే హత్య | - | Sakshi
Sakshi News home page

అప్పు ఇవ్వనందుకే హత్య

Nov 11 2025 7:25 AM | Updated on Nov 11 2025 7:25 AM

అప్పు ఇవ్వనందుకే హత్య

అప్పు ఇవ్వనందుకే హత్య

కూపీ లాగిన పోలీసులు

డబ్బు కావాలంటూ వచ్చి..

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు..

వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ

కేసును తప్పుదోవ పట్టించేందుకు

ఆభరణాలు చోరీ చేసి పరారైన

యువకుడు

8 రోజులు.. 200 మందిని

విచారించిన పోలీసులు

ఎట్టకేలకు అదుపులోకి నిందితుడు..

నేడో రేపో వివరాలు వెల్లడిస్తామన్న

పోలీసులు

గద్వాల క్రైం: అప్పు ఇవ్వనందుకే వడ్డీ వ్యాపారం చేస్తున్న ఓ మహిళను హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై కేసును తప్పుదోవ పట్టించేందుకు పథకం రచించాడు. మహిళ మెడలోని బంగారు ఆభరణాలు అపహరిస్తే గుర్తు తెలియని దుండగులు చోరీకి వచ్చి హత్య చేసి ఉంటారు అనుకునేలా ఆభరణాలతో పరారయ్యాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు 8 రోజులపాటు 200 మందిని విచారించారు. అటు సీసీ టీవీ ఫుటేజీ.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని హత్య కేసు మిస్టరీని ఛేదించారు. గద్వాల పట్టణంలో ఈ నెల 2వ తేదీన చోటుచేసుకున్న హత్య కేసు పూర్తి వివరాలిలా..

గద్వాలలోని శేరెల్లివిధిలోని అద్దె ఇంట్లో బలిజ లక్ష్మి (53) తన భర్త మల్లికార్జున్‌తో కలిసి మూడేళ్లుగా జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ధరూర్‌ మండలం గార్లపాడుకు చెందిన యువకుడు రాంరెడ్డి.. తల్లిదండ్రులతో కలిసి గద్వాలలోనే నివసిస్తున్నాడు. రాంరెడ్డి గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ అప్పులు తీర్చే క్రమంలో ఇబ్బందులు పడ్డాడు. ఎలాగైన వడ్డీవ్యాపారి లక్ష్మీతో అప్పు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఈక్రమంలోనే లక్ష్మి ఇంటికి వెళ్లి అప్పు అడిగాడు. ప్రస్తుతం డబ్బు ఇచ్చేంత పరిస్థితి లేదని, వస్తే ఇస్తానని చెప్పగా వెనుదిరిగాడు. ఈ నెల 2వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మరోసారి రాంరెడ్డి లక్ష్మి ఇంటికి వెళ్లగా.. ఇంకా డబ్బు రాలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి లక్ష్మీని రాంరెడ్డి బలంగా నెట్టివేశాడు. దీంతో లక్ష్మి కిందపడగా తల వెనుక భాగంగా గాయమై స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమె ముఖంపై మరోసారి దాడి చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించి తప్పించుకుని పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత భర్త ఇంటికి రాగా.. లక్ష్మి అనుమానాస్పద స్థితిలో పడి ఉండడం చూసి స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.

ఇదిలాఉండగా, భార్య లక్ష్మి ముఖం, తల వెనుక దాడి చేసిన గాయాలు ఉండడం, మెడలో బంగారు ఆభరణాలు లేకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈమేరకు అనుమానాస్పద వ్యక్తులు, మృతురాలితో అప్పు తీసుకున్న వారిని గుర్తించి విచారించారు. 8 రోజుల్లో దాదాపు 200 మంది వ్యక్తులను విచారించారు. కానీ, హత్యకు ఎక్కడా వారి ప్రమేయం లేకపోయింది. అయితే మృతురాలు ఉంటున్న అద్దె ఇళ్లు యువకుడు రాంరెడ్డి కుటుంబసభ్యులదే కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. మరో వైపు ఆ కాలనీకి 10 దారులు ఉండగా.. ఎవరెవరు ఏ దారిలో వచ్చి ఉంటారు అని అనేక కోణాల్లో విచారించారు. ఈక్రమంలోనే సీసీ కెమెరాల్లో అనుమానాస్పదంగా కనిపించిన యువకుడు రాంరెడ్డిని గుర్తించారు. అతడిని పట్టుకొని విచారించగా.. హత్యకు గల పూర్తి కారణాలు వెలుగులోకి వచ్చాయి.

అప్పు కోసం వెళ్లిన రాంరెడ్డి.. లక్ష్మిని నెట్టివేసి, ఆపై దాడి చేయడంతో ఆమె చలనం లేకుండా పడిపోయింది. దీంతో మృతిచెందిందని గుర్తించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు పథకం రచించాడు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలు అపహరిస్తే గుర్తు తెలియని దుండగులు చోరీకి వచ్చి హత్య చేసి ఉంటారు అనేలా చేశాడు. అయితే, రాంరెడ్డి 2024లో ఓ బెట్టింగ్‌ కేసులో నిందితుడు. ఆ సమయంలో పోలీసుల విచారణ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి కావడంతో.. అమాయకుడిలా మూడు రోజుల తర్వాత మాల ధరించాడు. మరోవైపు పోలీసులు ఎవరిని విచారిస్తున్నారు, బయటపడే మార్గాలపై అన్వేషించాడు. మొత్తానికి సీసీ కెమెరాలో ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. ఇదిలాఉండగా, పట్టపగలు మహిళ హత్య కావడం జిల్లాలో కలకలం రేపింది. మొదట ఈ హత్య దొంగలు చేసి ఉంటారనే అనుమానం వ్యక్తంకాగా.. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement