దొంగనోట్ల నిందితులు అరెస్టు
● పోలీసుల అదుపులో నలుగురు..
అందులో ఇద్దరు మైనర్లు
● పరారీలో కీలక నిందితుడు
జడ్చర్ల: పట్టణంలో విచ్చలవిడిగా చెలామణి అవుతున్న దొంగనోట్ల వ్యవహారానికి సంబంధించి సోమ వారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘వా మ్మో.. దొంగనోట్లు’ కథనానికి స్థానిక పోలీసులు స్పందించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టి.. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. అయితే దొంగనోట్ల తయారీకి సంబంధించిన కీలక నిందితుడు మాత్రం పోలీసులకు పట్టుబడలేదు. ఇందు కు సంబంధించిన వివరాలను సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సీఐ కమలాకర్ వెల్లడించారు. సీఐ కథనం మేరకు.. స్థానిక వెంకటేశ్వర కాలనీలోని కిరాణ దుకాణం వద్ద ఓ బాలుడు శుక్రవారం దొంగ నోటును మార్పిడి చేస్తుండగా.. అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తనకు చెలామణి చేసేందుకు దొంగ నోట్లను ఇచ్చిన మరో మైనార్టీ తీరని నిందితుడి ఇంటిని చూపిస్తానంటూ పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ క్రమంలో సిగ్నల్‌గడ్డ నుంచి కల్వకుర్తి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారులో మైనార్టీ తీరని బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరిని రాజాపూర్ మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన శివకుమార్, చెన్నయ్యలుగా గుర్తించారు. నిందితుల వద్ద చెలామణికి సిద్ధంగా ఉన్న 14 రూ.500 నోట్లతో పాటు మరో 13 రూ. 200 నకిలీ నోట్లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు మూడు నెలలుగా జడ్చర్ల ప్రాంతంలో నకిలీ నోట్లను చెలామణి చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 2లక్షల నకిలీ కరెన్సీని చెలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందని సీఐ తెలిపారు. ప్రధానంగా టీ హోటళ్లు, పాన్ షాప్‌లు, చిన్న చిన్న కిరాణ దుకాణాలను లక్ష్యంగా చేసుకోవడం.. ఆయా వ్యాపారాలు చేసే వయసు పైబడిన వారిని ఎంపిక చేసుకుని రద్దీ సమయాల్లో నోట్ల మార్పిడి చేస్తున్నట్లు తెలిపారు. అయితే వీరికి నోట్లు ఇచ్చే కీలక నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతడు పట్టుబడితే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. మహబూబ్‌నగర్‌లో కూడా విచారించామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఎస్‌ఐ జయప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
దొంగనోట్ల నిందితులు అరెస్టు
దొంగనోట్ల నిందితులు అరెస్టు


