మాధవరెడ్డి లిఫ్టు సర్వే పనులకు భూమిపూజ
సర్వే పనులకు భూమిపూజ చేస్తున్న రాష్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
వనపర్తి రూరల్: మండలంలోని కాశీంనగర్ సమీపంలో నిర్మించనున్న డాక్టర్ మాధవరెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 6 గ్రామాలు, 13 గిరిజన తండాల్లో దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ లిఫ్టు దోహదపడుతుందన్నారు. బీ8 నుంచి రామన్న గట్టు రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి, అక్కడి నుంచి మూడు లిప్టుల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని చిన్నారెడ్డి అన్నారు. మొదటి లిప్టు ద్వారా కాశీంనగర్‌లో 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రెండో లిఫ్టు ద్వారా దత్తాయిపల్లి, అంజనగిరిలో 1000 ఎకరాలకు, మూడో లిఫ్టు ద్వారా జయన్న తిర్మలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లిలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సర్వే పనులకు ప్రభుత్వం రూ.22 లక్షలు మంజూరు చేసిందని, సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్‌కు సమర్పిస్తారని, ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే లిఫ్టు ఇరిగేషన్ పనులు మొదలవుతాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్ నాయకులు రాములు, నందిమల్ల రాములు, గట్టు రాజు, రైతులు పాల్గొన్నారు.


