ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఉమ్మడి జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేదాక పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమ చాలీచాలని జీతాలు ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి పర్మనెంట్ పద్ధతిలో ఉద్యోగులను భర్తీ చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇచ్చే జీతాలు కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదని, నెలల తరబడి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 15 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతామన్నారు. జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కర్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను, నాయకులు సురేందర్‌గౌడ్, వనిత, కవిత, జితేంద్రుడు, శ్రీనివాసచారి, భరత్, వినోద్, రాంగోపాల్‌వర్మ, అనిల్, విజయలక్ష్మి, కామేష్, రవితేజ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


