సర్వీస్ ఉపాధ్యాయులకు ‘టెట్’ పెట్టొద్దు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెట్ అనేది కేవలం ఉపాధ్యాయులకు ఒక అర్హత పరీక్ష అని, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని వెంటనే టెట్ అర్హత సాధించాలని రాష్ట్రం కూడా చెప్పడంతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు. పరీక్ష అవసరం లేకుండా ఉండాలంటే ఆర్టీఈ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. అధికారంలోనికి వచ్చిన వెంటనే పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ 317లో భాగంగా వేరే జిల్లాలకు వెళ్లిన స్కూల్ అసిస్టెంట్‌లు సొంత జిల్లాలకు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించి.. 40 వేల పోస్టులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, పండిట్, పీఈటీలను కూడా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్‌కార్డులు సైతం వెంటనే ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమాకాంత్, నాయకులు శ్యాంబాబు, భూపతిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య


