
జలాశయాలకు జలకళ
● 90వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో,
91,340 ఔట్‌ఫ్లో
● 8క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల
● 12 యూనిట్లలో కొనసాగుతున్న
విద్యుదుత్పత్తి
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్ల్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7గంటల వరకు ప్రాజెక్టుకు లక్షా5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 90వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 8 క్రస్టుగేట్లను ఎత్తి 54, 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 36, 628 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 91, 340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.991 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
29.6 అడుగులకు కోయిల్‌సాగర్
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడానికి కేవలం మూడు అడుగుల దూరంలో నీటిమట్టం నిలిచింది. బుధవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో 29.6 అడుగలకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. మరో మూడు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు గేట్లను తెరిచేందుకు వీలుంది. పెద్దవాగు ప్రవాహం భారీగా వస్తే ఒక్కరోజులో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.
12 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాలకు పైనుంచి వరద వచ్చి చేరుతుండడంతో ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 12యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6యూనిట్ల ద్వారా 240మెగావాట్లు విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు.
రామన్‌పాడు ప్రాజెక్టు నుంచి
విడుదలవుతున్న నీరు