
ఈజీ మనీ కోసం దారిదోపిడీ
● బైక్‌ను వెంటాడి క్యాష్ బ్యాగ్
ఎత్తుకెళ్లిన నిందితుల అరెస్ట్
● డీఎస్పీ వెంకటేశ్వర్లు
జడ్చర్ల: జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలోని రిధి మద్యం దుకాణాన్ని బంద్ చేసి ఆరోజు వచ్చిన కలెక్షన్ తీసుకుని బైక్‌పై ఏనుగొండకు వెళ్తున్న వైన్స్ క్యాషియర్ అరుణ్‌రెడ్డిని ఈనెల 7న రాత్రి ఇద్దరు గుర్తు తెలియని యువకులు స్కూటీపై వెంబడించి కొత్తతండా వద్ద బైక్‌ను అడ్డగించి కళ్లల్లో కారంపొడిజల్లి చేతిలో ఉన్న నగదు బ్యాగును అపహరించిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ దొంగలను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటకు చెందిన మూలింటి బాలాజీ, మూలింటి రవితేజ పతకం ప్రకారం.. దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ రోజు స్థానిక లాడ్జీలో తలదాచుకుని వైన్స్ వద్ద నగదుతో బయటకు వస్తున్న క్యాషియర్‌ను గమనించి స్కూటీపై బైక్‌ను వెంబడించారు. రూ.1.44 లక్షల క్యాష్ బ్యాగును ఎత్తుకెళ్లిన అనంతరం బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బుధవారం జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై జాలీ హిల్స్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా స్కూటీపై వచ్చిన నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.72,500తోపాటు మొబైల్ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న డబ్బుతో కొత్తగా మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నిందితుల్లో బాలాజీ ఓ సంస్థలో డెలివరీ బాయ్‌గా, రవితేజ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ కమలాకర్, సిబ్బంది విష్ణుమూర్తి, కాశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.