
హరీశ్‌రావు ఆరోపణలు అవాస్తవం
అచ్చంపేట: అమ్రాబాద్ మండలం మాచారంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎంను కలిసేందుకు వచ్చిన చెంచులను నిర్భందించి, ఆరెస్టు చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2016లో మన్ననూర్‌లో చెంచుల మరణాలపై పుస్తకం ఆవిష్కరించినా హరీష్‌రావు.. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చెంచుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెంచులకు హైదారాబాద్‌లో కార్పొరేట్ వైద్యసేవలు అందించేవారని, బీఆర్‌ఎస్ హయంలో ఎందుకు అందించలేదని మండిపడ్డారు. జీవీవీకేలు, జీసీసీలను గత ప్రభుత్వం ఊపిరి తీస్తే.. తమ ప్రభుత్వం ఊపిరి పోస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చెంచులకు ఇచ్చిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను లాక్కునే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిర సౌరగిరి జల వికాస పథకం ద్వారా చెంచులను ఆదుకోనేందుకు రూ.12,600 కోట్లతో పండ్ల తోటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. చెంచులకు పక్కా ఇళ్లు కట్టించేందుకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించడం చెంచుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎంటో అర్థమవుతుందన్నారు. త్వరలోనే సలేశ్వరం లింగమయ్యను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్ది విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్ గౌరీ శంకర్, మాజీ ఎంపీపీ రామనాథం, నర్సయ్య యాదవ్, బాబా తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభ సందర్భంగా ఎవరిని అరెస్టు చేయలేదు
సభ విజయవంతం కావడంతోనే విమర్శలు
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ