
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
మహబూబ్‌నగర్ క్రీడలు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో జరుగుతున్న అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ రెండోరోజు మంగళవారం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా క్రికెట్ సంఘం ఎంతో పాటుపడుతున్నట్లు తెలిపారు.క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అనంతరం కొత్వాల్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో రెండో రౌండ్ లీగ్ మ్యాచులు జరుగుతాయని అన్నారు. క్రీడాకారులు లీగ్ మ్యాచుల్లో తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్ గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారుడు ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఇన్నింగ్స్ విజయం
ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూడే లీగ్‌లో మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం చేసింది. మహబూబ్‌నగర్ జట్టు ఇన్నింగ్స్ 49 పరుగుల తేడాతో జడ్చర్ల జట్టుపై విజయం సాధించింది. 255 పరుగుల ఆధిక్యంతో మహబూబ్‌నగర్ ఉండగా రెండో రోజు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన జడ్చర్ల జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులకు చేసింది. కేతన్‌కుమార్ యాదవ్ అజేయ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 106 బంతుల్లో 16 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహబూబ్‌నగర్ బౌలర్లు షాదాబ్ 2, శశాంక్ 2, డేవిడ్ క్రిపాల్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందడంతో మహబూబ్‌నగర్ జట్టు బోనస్‌పాయింట్‌తో కలిపి ఆరు పాయింట్లు సాధించింది.
టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
శుభారంభం చేసిన మహబూబ్‌నగర్ జట్టు