
డిగ్రీలో ప్రవేశానికి ‘దోస్త్’
నేటితో ముగియనున్న మొదటి దశ దరఖాస్తుల గడువు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 2025–26 విద్యా సంవత్సారానికి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తుల చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి దశలో భాగం 21 వరకు నేరుగా ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 29న అలాట్‌మెంట్, 30 నుంచి వచ్చే నెల 6 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. పీయూ పరిధిలో మొత్తం 74 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉండగా.. 31వేల డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు.
నాణ్యమైన విద్య
అందించడమే లక్ష్యం
పీయూ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందుకే ప్రైవేటు కళాశాలల్లో ర్యాటిఫికేషన్, అఫ్లియేషన్ ప్రక్రియ చేపట్టాం. దీంతో ప్రతి విద్యార్థి మంచి బోధన, వసతులు పొందగలుగుతారు. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వం రెండేళ్లు కళాశాలలో చదవడం, మూడో సంవత్సరం అప్రెంటిషిప్ చేసుకునే విధంగా కొత్త కోర్సులను తీసుకొచ్చింది. ప్రభుత్వం కొత్త డిగ్రీ, గురుకుల కళాశాలలు తీసుకొచ్చింది. కొన్ని కళాశాలల్లో సీట్ల సంఖ్య పెంచింది. వాటిలో చేరితే ఆర్థిక భారం తగ్గుతుంది.
– శ్రీనివాస్, వీసీ , పీయూ
దరఖాస్తు చేసుకోలేదు
పీయూ పరిధిలోని పలు కళాశాలలు ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు తీసుకునేందుకు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అడ్మిషన్లకు అవకాశం కల్పించాం. మారుమూల ప్రాంతాల విద్యార్థులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, గురుకుల కళాశాల్లో అడ్మిషన్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
– రమేష్‌బాబు, రిజిస్ట్రార్, పీయూ
ఉపాధి ఆధారిత కోర్సులు..
కొన్నేళ్లుగా పీయూ పరిధిలో మొత్తం ఉన్న సీట్లలో కనీసం 65శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం సాంప్రదాయ బీఏ, బీకాం వంటి కోర్సుల చదవడం వల్ల పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదనే వాదనలు ఉన్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం నూతన విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు మూడేళ్ల డిగ్రీ కాలంలో రెండేళ్లు కళాశాలలో తరగతులు.. చివరి సంవత్సరం అప్రెంటిషిప్ ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థికి వేతనం సైతం లభిస్తుంది. ఇటువంటి కోర్సులు ఎంవీఎస్‌లో 5, ఎన్టీఆర్‌లో 2, బీఆర్‌ఆర్‌తో పాటు మరిన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. అందులో బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్‌కు ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు, బీఎస్సీ మార్కెటింగ్, ఫార్మా సేల్స్, బీఎస్సీ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌కు బైపీసీ, బీకాం బీఎఫ్‌ఎస్‌ఐకి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
మూతబడ్డ 24 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు
దరఖాస్తు చేసుకోని 12 కళాశాలలు
74 కళాశాలల్లో 31వేల అడ్మిషన్లకు అవకాశం

డిగ్రీలో ప్రవేశానికి ‘దోస్త్’

డిగ్రీలో ప్రవేశానికి ‘దోస్త్’