
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల భూ సేకరణ, పునరావాస పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్‌లో కలెక్టర్ విజయేందిరతో కలిసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణం భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను, కోయిల్ సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదండపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా జడ్చర్ల మండలంలోని వల్లూర్, ఉదండపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు వివరించారు. దీంతో జడ్చర్ల మండలంలోని ఖానాపూర్, ఉదండాపూర్, వల్లూరు, పోలేపల్లి, కిస్టారం రెవెన్యూ గ్రామాలు, నవాబ్ పేట మండలం లోని తీగలపల్లి, కార్‌కొండ, సిద్ధోటం రెవెన్యూ గ్రామాల్లో 4887.035 ఎకరాల వ్యవసాయ భూముల భూ సేకరణకు గాను 4876.185 ఎకరాలు భూసేకరణ చేసినట్లు, ఉదండపూర్ రెవెన్యూ గ్రామంలో 1453.33 ఎకరాలకు గాను 1443.09 ఎకరాలు సేకరించామని ఇంకా 10.24 ఎకరాలు భూ సేకరణ చేయవలసి ఉందని వివరించారు. వల్లూర్, ఉదండాపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్ట తండా, ఒంటిగుడిసెతండా, శామగడ్డతండా, పోలేపల్లి ఆవాస ప్రాంతాల్లో 1954 గృహాల కోసం 60.26 ఎకరాల భూ సేకరణకు నోటిఫై చేసినట్లు తెలిపారు. 667 గృహాలకు అవార్డ్ పాస్ చేసినట్లు, 510 గృహాలకు టోకెన్లు జనరేట్ చేసినట్లు ఇంకా బ్యాలెన్స్ 161 గృహాలకు టోకెన్లు జనరేట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్‌అండ్‌ఆర్ కింద తుమ్మల కుంటతండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటిగుడిసెతండా, పోలేపల్లి నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. జడ్చర్ల మండలంలోని నిర్వాసితులకు పోలేపల్లిలో 125.13 ఎకరాలను, జడ్చర్లలో 149.19 ఎకరాలు మొత్తం 274.32 ఎకరాలను పునరావాస కాలనీలుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఆర్‌అండ్‌ఆర్ లోకేషన్ 1, 2 లలో మౌలిక వసతుల పనులు చేపట్టినట్లు వివరించారు. అనంతరం కోయిల్‌సాగర్, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకాల భూసేకరణ పనులను సమీక్షించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ బి.వి.రమణారెడ్డి, ఎస్‌ఈ చక్రధరం, ఆర్‌డీఓ నవీన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్‌రావు, పీఆర్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేక
అధికారి రవినాయక్