
పులకరించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి రెండోసారి రావడంతో గ్రామస్తులు పులకరించిపోయారు. సోమవారం సాయంత్రం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎంకు గజమాలతో ఘనస్వాతం పలికారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు భాజాభజంత్రీలతో స్వాగతం పలికారు. ఆంజనేయస్వామి ఆలయంలో సామూహికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి దంపతులు ఆంజనేయస్వామి, శివుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పండితులు ముఖ్యమంత్రి దంపతులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశీర్వచనం చేసి శాలువాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి సొంత నిధులతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడం అభినందనీయమని పలువురు మంత్రులు కొనియాడారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యేకంగా చేసిన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రులు హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లగా.. కొంత ఆలస్యంగా ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
వంగూరు మండల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొండారెడ్డిపల్లిలో సీఎంను ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నరేందరర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్ కలిసి మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. రూ. 100కోట్లతో కొండారెడ్డిపల్లి నుంచి హాజీపూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం, పలు గ్రామాల్లో రూ. 12కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడంతో పాటు విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని వారు సీఎం దృష్టికి తెచ్చారు. అన్నింటినీ పరిశీలించి నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, కొండారెడ్డిపల్లికి చెందిన వందన గీసిన ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, వేమారెడ్డి, కృష్ణారెడ్డి, లాలూ యాదవ్, వంశీ తదితరులు ఉన్నారు.
మండల అభివృద్ధికి నిధులు..
సీఎం రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం దంపతులు, మంత్రులు