
నాందేడ్‌లో చెంచు మహిళ మృతి
బల్మూర్: ఆదివాసి చెంచు మహిళ వలస వెళ్లి మహారాష్ట్రలోని నాందేడ్‌లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని బాణాలకు చెందిన నల్లబోతుల లింగస్వామి లింగాల మండలం అప్పాయిపల్లికి చెందిన కవిత (26)ను రెండు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు అప్పాయిపల్లికి చెందిన గుంపు మేసీ్త్ర అర్జున్‌తో రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకొని బాణాలకు చెందిన మరికొందరితో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్‌కు పనికి వెళ్లారు. ఈ నెల 15న పని ప్రదేశంలో కవిత బావిలో పడి మృతి చెందడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. భర్త, అత్త చిట్టెమ్మ అక్కడ పని చేస్తున్న మరో ఇద్దరు మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొచ్చి ఈ నెల 17న శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కవిత తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందగా 12 ఏళ్ల సోదరుడు గణేష్ ఉన్నారు. అతడి సంరక్షణకుగాను రూ.75 వేలు గుంపుమేసీ్త్ర ఇచ్చేలా మధ్యవర్తులు ఒప్పందం కుదుర్చారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గుంపు మేసీ్త్ర తమను పట్టించుకోవడం లేదని.. ఇస్తానని రూ.75 వేలు కూడా ఇవ్వడం లేదని లింగస్వామి, అతడి తల్లి చిట్టెమ్మ వాపోతున్నారు.
గుంపు మేసీ్త్ర చెరలో 33 మంది చెంచులు..
అప్పాయిపల్లికి చెందిన గుంపు మేస్త్రి అర్జున్ లింగాల మండలంలోని శ్రీరంగాపూర్, బల్మూర్ మండలంలో ని బాణాల నుంచి 33 మంది చెంచులను అడ్వాన్సు లు ఇచ్చి మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ కంపెనీలో సిమెంట్, కాంక్రీట్ పనులు చేసేందుకు తీసుకెళ్లాడని బాధితులు విలేకర్లకు తెలిపారు. వెళ్లే సమయంలో రోజు కూలి రూ.500 ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్లాక నెలకు కేవలం రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు. అంతేగాకుండా నెలలో రెండ్రోజులు మాత్రమే సెలవులిస్తూ.. నాసిరకంగా భోజనం అందిస్తున్నారని వివరించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి కవిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు గుంపు మేస్త్రిపై కఠిన చర్యలు తీసుకోని అక్కడి చెంచులను స్వగ్రామాలకు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
అలస్యంగా వెలుగు చూసిన ఘటన