
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుంది
జెడ్పీసెంటర్(హహబూబ్‌నగర్): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జై మహాభారత్ పార్టీ సత్తా చాటుతుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందిస్తున్నట్లు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు అన్నారు. సోమవారం స్థానిక జిల్లా క్లబ్ మీటింగ్‌హాల్లో ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాల వారీగా కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు తమ పార్టీ తరుపున అభ్యర్థులను పోటీలో పెట్టునున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎజెండాల్లో ముఖ్యమైనది రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ ఉచిత విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదులను అనుసంధానం చేసి సాగు, తాగు నీళ్ల సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జై మహాభారత్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి చెన్నప్పగారి రఘోత్తంరెడ్డి, కో ఇన్‌చార్జి అనుప రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు నిజామొద్దీన్, కో ఆర్డినేటర్లు చెన్నయ్య, జిల్లా ఆర్గనైజర్ వహీద్ పాల్గొన్నారు.
119 స్థానాల్లో జై మహాభారత్ పార్టీ పోటీ
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అనంతవిష్ణు